Odisha: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి.. నరికి చంపిన దుండగులు.. ఒడిశాలో దారుణం!

  • గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థి
  • మాట్లాడే పని ఉందంటూ బయటకు తీసుకెళ్లిన దుండగులు
  • కాళ్లు చేతులు నరికివేత
ఒడిశాలో దారుణం జరిగింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేంఝర్ జిల్లాలోని ఘషిపుర స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా నరికి చంపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధకోటికి గ్రామానికి చెందిన రామచంద్ర బెహరా గత ఎన్నికల్లో ఘషిపుర స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం మళ్లీ అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రామచంద్ర సిద్ధమయ్యారు. విషయం తెలిసిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి ఆయన ఇంటికి వచ్చి మాట్లాడాలంటూ బయటకు తీసుకెళ్లారు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామ శివారులో గాలించగా అపస్మారక స్థితిలో ఉన్న రామచంద్రను మంగళవారం ఉదయం గుర్తించి  వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులను దారుణంగా నరికివేయడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆనంద్‌పూర్ ఆసుపత్రి నుంచి కటక్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Odisha
cuttack
Assembly elections
Independent
Crime News
Police

More Telugu News