Andhra Pradesh: ఎక్కడ చూసినా జన ప్రభంజనం, టీడీపీపై సానుకూలత: సీఎం చంద్రబాబు

  • ఇదే స్ఫూర్తితో పని చేస్తే అనుకున్న లక్ష్యం సాధిస్తాం
  • సంక్షేమ పథకాలపై ప్రజల్లో అపూర్వ ఆదరణ
  • ఏపీ యావత్తూ వైసీపీకి  వ్యతిరేకంగా ఏకం కావాలి

ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చంద్రబాబు చేశారు. ఎక్కడ చూసినా జన ప్రభంజనం, ప్రజల్లో టీడీపీపై సానుకూలత ఉందని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే అనుకున్న లక్ష్యం సులభంగా సాధిస్తామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్టు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందని, దీంతో, తమకు ఓటమి తప్పదని భావిస్తున్న వైసీపీ ఉన్మాది పార్టీగా మారిందని దుయ్యబట్టారు. పోలీసులపై కులముద్ర వేయడం నీచాతినీచమని జగన్ పై విరుచుకుపడ్డారు.

ఏపీ యావత్తూ వైసీపీకి వ్యతిరేకంగా ఏకం కావాలని, ఏపీలో కేసీఆర్ పెత్తనంపై ప్రజల్లో ఆవేశం, కోపం ఉన్నాయని, మన రాష్ట్రంలో నష్టాలకు కారకుడు 'మోసాల చంద్రశేఖరరావు' అని బాబు నిప్పులు చెరిగినట్టు పార్టీ వర్గాల సమాచారం. అసమానంగా రాష్ట్ర విభజనపై అప్పుడు పోరాడామని, నమ్మించి మోసగించిన బీజేపీపై ధర్మపోరాటం చేశామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రా ద్రోహులపై పోరాటం చేస్తున్నామని, టీడీపీ ఎప్పుడూ ధర్మం వెన్నంటే ఉంటుందని పార్టీ నేతలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

More Telugu News