Gujarath: ఇంతకంటే హేయం ఉంటుందా?... నిలుచోబెట్టి మహిళకు ప్రసవం చేశారు!

  • గుజరాత్ లో ఘటన
  • వైద్య సిబ్బంది అమానుషం
  • మహిళ బంధువుల ఆందోళన

వైద్యం అనేది ప్రతి మనిషి ప్రాథమిక హక్కుల్లో భాగం. మరి, మాతృత్వంతో ప్రపంచానికే జన్మనిచ్చే మహిళకు నైతికపరంగా ఘనమైన వైద్యసదుపాయాలు అందాలి. కానీ, ఈ సంఘటనలో అత్యంత హేయంగా వ్యవహరించారు వైద్య సిబ్బంది. గుజరాత్ లో జరిగిందీ ఘటన. కాన్పు కోసం వచ్చిన మహిళను నిలుచోబెట్టి ప్రసవం చేశారు. నవమాసాలు మోసిన బిడ్డను కళ్లారా చూసుకోవాలని ఆశించిన ఆమెకు నరకం చూపించి మరీ కాన్పు చేశారు ఆసుపత్రి సిబ్బంది.

గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో రామీ బెన్ అనే మహిళ నెలలు నిండడంతో కాన్పు కోసం తన అత్తగారితో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అయితే, అక్కడి నర్సు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి, రామీ బెన్ ను ఓ ఇనుప కడ్డీని పట్టుకోమని చెప్పి అక్కడికక్కడే పురుడు పోసింది. ప్రసూతి తాలూకు రక్తాన్ని కూడా రామీ బెన్ చీరతోనే తుడిపించి మానవత్వానికే అవమానంలా వ్యవహరించింది. ఈ విషయం తెలిసిన రామీ బెన్ బంధుజనం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, తమ ఆసుపత్రిలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఎప్పుడూ జరగలేదని ఓ సీనియర్ డాక్టర్ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, ప్రజలు మాత్రం ఇక్కడ గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

More Telugu News