Andhra Pradesh: జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల!

  • ఏపీ ఎన్నికల్లో మంచిని గెలిపించండి
  • పవన్ యాక్టర్, చంద్రబాబు డైరెక్టర్
  • పవన్ నామినేషన్ లో పచ్చ కేడర్
ఏపీ సీఎం చంద్రబాబుకు ఈసారి ఓటు వేస్తే ఏపీ మరో 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుందని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల హెచ్చరించారు. చంద్రబాబు తీరు రోజుకో మాట, పూటకో వేషంగా తయారయిందని విమర్శించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల పోరాటంలో మంచిని గెలిపించాలని ఏపీ ప్రజలకు షర్మిల విజ్ఞప్తి  చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తికి మంచి మనసుంటేనే సామాన్యులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

లోకేశ్ కు మూడు శాఖలతో మంత్రి పదవి కట్టబెట్టడం.. అ.. ఆలు కూడా రానివాడికి అగ్రతాంబూలం ఇచ్చినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. ఏపీ ప్రస్తుతం దుర్మార్గుల చేతిలో పడి అల్లాడుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ పై జనసేన పార్టీ చీఫ్ విమర్శలు చేయడంపై స్పందిస్తూ..’పవన్ కల్యాణ్ ఎవరు.  యాక్టర్.. అవునా? ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేయాలి.

పవన్ రాజకీయ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్. కాబట్టి పవన్ కల్యాణ్ చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఐటీ గ్రిడ్స్ కేసులో పవన్ కల్యాణ్ చంద్రబాబును ప్రశ్నించకపోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. పవన్ నామినేషన్ వేయడానికి వెళితే అక్కడ పచ్చపార్టీ కేడర్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

పొత్తులేదు పొత్తులేదు అని చెప్పుకుంటూనే లోలోపల సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్ వివేకా హత్యకేసులో తాము మూడో పక్షం విచారణ కోరుతుంటే పవన్ ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జనసేనకు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని తేల్చిచెప్పారు.

తమ ఇంటిపెద్ద వివేకానందరెడ్డిని దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కుటుంబంలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులను చంపి తమపైనే అభాండాలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Sharmila
Chandrababu
Telugudesam
Jana Sena
Pawan Kalyan

More Telugu News