Chandrababu: నా మీద ఆ ఒక్క కేసు మాత్రమే ఉంది: తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు వెల్లడి

  • జగన్ ను నమ్మితే జైలేగతి
  • రాష్ట్రానికి అతిపెద్ద సమస్య జగనే
  • కేసీఆర్ తోనే పోటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆ రోడ్ షోలో మాట్లాడుతూ, జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో 40 పేజీలు జగన్ నేరచరిత్ర గురించే ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్ పై 31 కేసులు ఉన్నాయని, అవన్నీ ఆర్థిక నేరాలేనని అన్నారు. అయితే తనపై ఒక్క కేసు మాత్రమే ఉందని, అది కూడా ప్రజల కోసం పోరాడినందుకే ఆ కేసు పెట్టారని వివరించారు. గతంలో బాబ్లీ ప్రాజక్ట్ ను మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఎత్తు పెంచుతుండడంతో తాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తనపై కేసు పెట్టారని వెల్లడించారు. అదీ తనకు, జగన్ కు ఉన్న తేడా అని ఉద్ఘాటించారు.

అంతేగాకుండా, ఇంట్లో మనిషిని చంపుకునే వ్యక్తులకు సహకరిస్తారా? అంటూ తిరుపతి ప్రజలను ప్రశ్నించారు. వివేకా చనిపోతే గుండెపోటు కింద చిత్రీకరించి, సాక్ష్యాధారాలు చెరిపేసి దుర్మార్గానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. జగన్ ను నమ్ముకుంటే జైలేగతి అన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద సమస్యలా కనిపిస్తున్నాడంటూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తున్నా, పోరాటం మాత్రం తనకు, కేసీఆర్ కు మాత్రమేనని స్పష్టం చేశారు. దొడ్డిదారిన రాష్ట్రంపై పెత్తనం చేయాలని కేసీఆర్ తహతహలాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

More Telugu News