Jana Sena: మంచీ చెడే నా ఎజెండా... పార్టీలు, వ్యక్తులతో సంబంధం లేదు: పవన్‌కల్యాణ్‌

  • చంద్రబాబుకు, జగన్‌కు సమాన దూరం
  • ఇద్దరినీ ఎన్నో సందర్భాల్లో నిలదీశాను
  • ఇప్పుడు కొత్తగా చంద్రబాబుతో కలిసేదేముంది
నాయకులైనా, పార్టీలైనా వారిలోని మంచీ, చెడే తన అజెండా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. పార్టీలను, వ్యక్తులను చూసి విమర్శించే తత్వం తనది కాదని స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో జనసేన మళ్లీ కలిసిపోయిందంటూ విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్‌ ఇచ్చారు.

ఇటువంటి మాటలు సిగ్గుచేటన్నారు. టీడీపీ, వైసీపీలకు తాను సమాన దూరం పాటిస్తున్నానని చెప్పారు. ఆంధ్రులను తెలంగాణ నేతలు తిడుతుంటే జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ధాటికి తట్టుకోలేక చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి వచ్చేశారని, లోకేశ్ ఆ ఛాయలకు కూడా వెళ్లడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలే తాను ప్రస్తావిస్తున్నానని గుర్తు చేశారు.

పార్టీ కార్యాలయంలో మాత్రమే బీ ఫాంలు ఇచ్చిన చరిత్ర జనసేనదన్నారు. అదే అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ప్రభుత్వం ఇచ్చిన బంగ్లాలో కూర్చుని బీఫాంలు ఇస్తుంటే, జగన్‌ లోటస్‌పాండ్‌లో కూర్చుని ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగినప్పుడు ఆయన తల్లే చేయించారని కొందరు విపక్ష నేతలు విమర్శిస్తే ఆ వ్యాఖ్యలను తాను ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. సందర్భమే తప్ప పార్టీలు, నాయకులను అనుసరించి తాను స్పందించనని స్పష్టం చేశారు.
Jana Sena
Pawan Kalyan
Chandrababu
Jagan

More Telugu News