Chandrababu: గోద్రా అల్లర్ల సమయంలో నిలదీసినందుకే నేనంటే మోదీకి కోపం: చంద్రబాబు

  • మోదీ రాజీనామాకు డిమాండ్ చేసింది నేనొక్కడినే
  • మైనారిటీలకు అన్యాయం జరిగిందని భావించాను
  • కేసీఆర్ దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి నాకుంది

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. నేటి రాత్రి భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఎం నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గోద్రా అల్లర్ల సమయంలో తాను నిలదీశానని మోదీకి తానంటే కోపం అని చంద్రబాబు వెల్లడించారు.

 ఆనాడు మైనారిటీలకు అన్యాయం జరిగిందని తాను భావించానని, అందుకే మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఆ వేళ మోదీని ఎదిరించిన ఏకైక నేతను తానొక్కడినే అని చంద్రబాబు తెలిపారు. ముస్లింలకు వేరే చట్టం పెట్టి వాళ్లను బాధపెడతాం అంటే అలా చెయ్యడానికి వీల్లేదు అని ఎదిరించింది, అడ్డుపడింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ ను మించిపోయేలా రాజధాని అమరావతి కడుతున్నామని ఆయనకు కోపం అన్నారు.

విభజనలో హేతుబద్ధత లేదని, పైగా విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ సర్కారు వేధిస్తోందని ఆరోపించారు. ఇదే విషయంలో 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అంటూ గల్లా జయదేవ్ కేంద్రాన్ని నిలదీసి అడిగారని గుర్తుచేశారు. కేంద్రం వైఖరి అలా ఉంటే ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ మాత్రం కేసీఆర్ ఆడమంటే ఆడతారు, ఎగరమంటే ఎగురుతారు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణలో హిట్లర్ లా తయారవడమే గాకుండా ఏపీలో తమపైనా పెత్తనం చేసేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. కేసీఆర్ దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి తనకుందని, ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా కాపాడుకుంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News