Andhra Pradesh: చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్!: ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు

  • టీడీపీ గెలుపు ఏకపక్షమయింది
  • దీంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరుగుతోంది
  • 31 కేసులు ఉన్నవాడికి ఓటేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే రాష్ట్రంలో అరాచకాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అరాచక శక్తి అని చెప్పడానికి ఆయన దాఖలుచేసిన అఫిడవిటే నిదర్శనమని వ్యాఖ్యానించారు.  48 పేజీల అఫిడవిట్ లో 31 కేసులు జగన్ నేర చరిత్రకు రుజువులన్నారు. దేశంలోని ఎవరి అఫిడవిట్ లోనూ ఇన్ని కేసులు ఉండవన్నారు.

‘చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్. దావూద్ ఇబ్రహీంలో ఒకటే ఉగ్రవాద నేరకోణం, నీరవ్ మోదిలో ఒకటే బ్యాంక్ చీటింగ్ నేర కోణం. హర్షద్ మెహతాది ఒకటే ఆర్ధిక నేరకోణం, ఛార్లెస్ శోభరాజ్‌ది ఒకటే హింసావాద నేర కోణం. ఈ నేర కోణాలన్నీ కలిసి కరడుగట్టిన క్రిమినల్ జగన్ మోహన్ రెడ్డి’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

‘బిడ్డను ఇచ్చి పెళ్లి చేయడానికి అనేకసార్లు ఆలోచిస్తాం. చదువు-సంస్కారం, ఉద్యోగం చూసి పిల్లనిస్తాం. ఇల్లు అద్దెకు ఇచ్చేముందు ఆలోచించి ఇస్తాం. మరి మన ఓటు వేసే ముందు ఎన్ని ఆలోచించాలి? 31 కేసులున్న వాడికి ఎవరైనా ఓటేస్తారా..? అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో టీడీపీకి మరోసారి అధికారం అప్పగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News