India: అంధుల కోసం ప్రత్యేకమైన యాప్ తీసుకువస్తున్న ఆర్బీఐ

  • కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు యాప్
  • అభివృద్ధి దశలో ఉంది
  • న్యాయస్థానానికి వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంధుల కోసం సరికొత్తగా యాప్ ను తీసుకువస్తోంది. తాము రూపొందించిన కొత్త కరెన్సీ నోట్లను అంధులు సులువుగా గుర్తించేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు బాంబే హైకోర్టుకు తెలియజేసింది. కొన్నిరోజుల క్రితం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద బ్లైండ్ (ఎన్ఏబి) బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్బీఐ రూపొందించిన కొత్త నోట్లు అంధులు గుర్తించలేని విధంగా ఉన్నాయని ఎన్ఏబి తన పిటిషన్ లో పేర్కొంది. తాజాగా విడుదల చేస్తున్న కరెన్సీ నోట్లు, నాణాలను తాకడం ద్వారా వాటి విలువను గుర్తించడంలో అంధులు చాలా ఇబ్బంది పడుతున్నారంటూ వివరించింది.

ఎన్ఏబీ పిటిషన్ పై విచారణ ప్రారంభించిన బాంబే హైకోర్టు ఆర్బీఐని వివరణ కోరింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన విచారణలో ఆర్బీఐ తన వాదనలు తెలిపింది. ఈ సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, యాప్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి. అయినా, ఇప్పుడొస్తున్న రూ.100, ఆపై విలువ ఉండే నోట్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయని వాటిసాయంతో అంధులు నోట్ల విలువను తెలుసుకోవచ్చని తెలిపాయి. విమర్శలు వస్తున్న నేపథ్యంలో, తాము నూతన సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నామని, దీన్ని మొబైల్ ఫోన్లలో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆర్బీఐ వివరించింది.

More Telugu News