mohanbabu: అడిగితే సమాధానం ఇవ్వవా? అంత అహంకారమా?: చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్

  • అన్నయ్య మీద అభిమానంతోనే అందరూ నీ దగ్గర ఉన్నారు
  • టీడీపీ నీది కాదు.. నీవు లాక్కున్నావు
  • మనిషే శాశ్వతం కానప్పుడు... పదవులు ఎంత వరకు శాశ్వతం?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అన్నయ్య ఎన్టీఆర్ ది కానీ... నీదెలా అవుతుందని ప్రశ్నించారు. తెలుగుదేశం నీది కాదని... నీవు మభ్యపెట్టి, లాక్కున్న పార్టీ అని అన్నారు. 'ప్రతిసారీ నా పార్టీ, నా పార్టీ అంటావ్. అది నీ పార్టీ కాదు. అన్నయ్య మీద అభిమానంతోనే అందరూ నీ దగ్గర ఉన్నారయ్యా. అది తెలుసుకో' అని అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలంటూ తిరుపతిలో మోహన్ బాబు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై మండిపడ్డారు.

తన కాలేజీకి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు అడిగితే సమాధానం ఇవ్వరా? అంత పొగరా? అంత అహంకారమా? అంటూ మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ, కాలం ఎప్పుడు మనదే కాదు అనే విషయం గుర్తుంచుకో అని అన్నారు. దోచేసిన ఎంతో మందిని చూశామని, చివరకు వారు సంపాదించిన డబ్బు ఏమైపోయిందో కూడా తెలియదని... ప్రజల సొమ్ము చివరకు ప్రజల వద్దకే వెళుతుందని అన్నారు. ఇన్ని కోట్లు సంపాదించిన నీవు రేపు ఏమవుతావో అని వ్యాఖ్యానించారు. మనిషే శాశ్వతం కానప్పుడు, పదవి ఎంత వరకు శాశ్వతమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తివే అయితే.. వెంటనే వారి ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసత్యాలు మాట్లాడే చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

చంద్రబాబు అంటే తనకు ఇష్టమేకానీ... ఆయన నాటకాలు మాత్రం ఇష్టం లేదని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారని... అమాయకులైన ప్రజలు ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు... యువతకు ఏ ఉద్యోగాలు ఇస్తారని ఎద్దేవా చేశారు.

More Telugu News