Mohanbabu: ఈ 'పసుపు కుంకుమ' నాలుగేళ్ల క్రితం ఎందుకు లేదు?: చంద్రబాబుకు మోహన్ బాబు సూటి ప్రశ్న

  • మూడు నెలలకు ముందే ఎందుకు గుర్తు కొచ్చింది
  • మాకివ్వాల్సిన డబ్బును రకరకాలుగా మళ్లిస్తున్నారు
  • తిరుపతిలో ఆరోపించిన మోహన్ బాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు 'పసుపు కుంకుమ' పథకం నాలుగు సంవత్సరాల క్రితం ఎందుకు గుర్తుకు రాలేదని, కేవలం మూడు నెలలకు ముందే ఎందుకు గుర్తుకు వచ్చిందని నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ ఉదయం తిరుపతిలో వందలాది మంది విద్యార్థులు, తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించిన ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు ఆడుకుంటోందని ఆరోపించిన ఆయన, కళాశాలల యాజమాన్యాలకు కట్టాల్సిన డబ్బును ప్రభుత్వం రకరకాలుగా మళ్లిస్తోందని ఆరోపించారు.

 చంద్రబాబు వైఖరికి నిరసనగానే తాను ఈ న్యాయ పోరాటానికి దిగానని, పిల్లల చదువుకు డబ్బులే ఇవ్వని ఆయన, ఉద్యోగం ఇస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మహానటుడు ఎన్టీఆర్ కే పార్టీ సభ్యత్వం లేకుండా చేశారని ఆరోపించిన మోహన్ బాబు, ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే కార్యకర్తలు ఇంకా టీడీపీతో ఉన్నారని అన్నారు. కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దేశంలోని 20 పార్టీలకు చెందిన విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు గురించి చంద్రబాబు ఆలోచించే వారే అయితే, వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

More Telugu News