USA: పోలీసు వృత్తికే కళంకం ఈ లేడీ పోలీసాఫీసర్!

  • కన్నబిడ్డను కారులో వదిలి అధికారితో సరసాలు
  • అధిక ఉష్ణోగ్రతతో బిడ్డ మృతి
  • 2016లో ఘటన... 20 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

పోలీసు వృత్తి అత్యంత బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఒకటి. కానీ, ఈ అధికారిణి మాత్రం పోలీసాఫీసర్ గా పనిచేస్తూనే పై అధికారితో రాసలీలలకు అలవాటు పడి కన్నబిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైంది. అమెరికాలోని మిస్సిసిపీలో కేసీ బార్కర్ (29) అనే లేడీ పోలీసాఫీసర్ బీచ్ లో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ తన మూడేళ్ల కుమార్తె షియాన్నే హైర్ ను కూడా వాహనంలో వెంట తీసుకువచ్చింది. అయితే, తన పైఅధికారితో అక్రమ సంబంధం కలిగి ఉన్న కేసీ బార్కర్ అతడి ఇంటికి వెళ్లి రాసలీలల్లో మునిగిపోయింది. కానీ, బిడ్డను మాత్రం కారులోనే ఉంచి వెళ్లిపోయింది. అధికారి ఇంట్లోనే నిద్రపోయిన కేసీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో వచ్చి చూడగా కారులో ఉన్న చిన్నారి విగతజీవిగా దర్శనమిచ్చింది. కారులో ఏసీ పనిచేయకపోవడంతో టెంపరేచర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయి ఆ చిన్నారి ఉక్కిరిబిక్కిరైపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగింది 2016లో.

అయితే కేసీ బార్కర్ ఈ విషయాన్ని చాలాకాలం దాచి ఉంచింది. అయితే, ఎట్టకేలకు తన నిర్వాకాన్ని కోర్టు ముందు ఉంచడంతో విచారణ అనంతరం న్యాయమూర్తి కేసీ బార్కర్ కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అంతకుముందు కూడా కేసీ ఇలాగే తన చిన్నారిని కారులో వదిలి వెళ్లిపోవడంతో డిపార్ట్ మెంట్ ఆమెను వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది. అయినా గానీ ఆమెలో మార్పు రాకపోగా, ఈసారి ఆ చిన్నారి ప్రాణాలే పోయాయి.

More Telugu News