Andhra Pradesh: నోటీసులు అందుకున్నవారు 48 గంటల్లో సమాధానం చెప్పాలి: ఎన్నికల సంఘం

  • పోలీసులపైనా ఫిర్యాదులు వస్తున్నాయి
  • పరిశీలించి చర్యలు తీసుకుంటాం
  • సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టీకరణ

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఫిర్యాదులపై దృష్టి సారించారు. పత్రికల్లో వస్తున్న వార్తలు, టీవీ చానళ్లలో జరిగే చర్చా కార్యక్రమాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఆ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత సంబంధిత వార్తలు, చర్చల్లోని తీవ్రత చూసి నోటీసులు పంపిస్తున్నామని వెల్లడించారు.

నోటీసులు అందుకున్న వారు 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆర్టీజీఎస్ పై ఫిర్యాదు రాలేదని, వస్తే కనుక పరిశీలించి చర్యలు తీసుకుంటామని ద్వివేది తెలిపారు. ఎన్నికల తరుణంలో పోలీసుల వైఖరిపైనా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై కూలంకషంగా దర్యాప్తుచేసి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని, అయితే, ఇప్పటివరకు తమకు అందిన ఫిర్యాదులపై విచారణ చేస్తే చాలావరకు నకిలీవని తేలిందని ద్వివేది చెప్పుకొచ్చారు. కాగా, ఏపీ డేటా విషయంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. ఈ డేటా చౌర్యం వ్యవహారంలో ఎన్నికల సంఘానికి చెందిన ఓటర్ల జాబితా లీక్ కాలేదని ఆయన వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం, ఫారం-7 ఫిర్యాదులపై దర్యాప్తు బృందం కంప్యూటర్ ఐపీ అడ్రస్ లు కోరిందని, కానీ, కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీడాక్ సంస్థ ఐపీ అడ్రస్ లు ఇంకా ఇవ్వలేదని వెల్లడించారు. ప్రభుత్వం వేసిన సిట్ కు ఈసీ అన్ని విధాలుగా సహకరిస్తుందని, తమ వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ తో పంచుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News