Telugudesam: ఎన్నికల తర్వాత చిత్తూరు పంపిస్తా!: గల్లా జయదేవ్ కు జనసేన అభ్యర్థి వార్నింగ్

  • నిన్నటి మిత్రుడు.. నేడు ప్రత్యర్థి 
  • డమ్మీ అంటే తాట తీస్తా!
  • గల్లాను హెచ్చరిస్తున్న జనసేన అభ్యర్థి

రాజకీయాల్లో నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్లు నేడు శత్రువులైపోవచ్చు, బద్ధవిరోధులుగా ఉన్నవాళ్ల మధ్య స్నేహకుసుమాలు వికసించవచ్చు! ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్, వైఎస్సార్సీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా, మూడో అభ్యర్థిగా జనసేన తరఫున బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగారు. బోనబోయిన నిన్నమొన్నటిదాకా టీడీపీలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. రెండ్రోజల క్రితమే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గంలో గల్లా జయదేవ్ విజయం కోసం బోనబోయిన ఎంతో కృషి చేశారని ప్రచారంలో ఉంది. అయితే, అది గతం!

ఇప్పుడు గల్లా జయదేవ్ పై బోనబోయిన పోటీకి దిగడంతో ఇద్దరి మధ్య స్పర్ధ నెలకొంది. ఈ నేపథ్యంలో, గల్లా తనను డమ్మీ క్యాండిడేట్ అన్నారంటూ బోనబోయిన విపరీతంగా గింజుకున్నారు. తనను డమ్మీ అన్న వాళ్ల తాటతీస్తానంటూ హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గల్లా, మోదుగుల ఓటమిపాలవడం ఖాయమని, వాళ్లిద్దరూ ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా ఎన్నికల్లో తన విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని బోనబోయిన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత గల్లా, మోదుగుల చిత్తూరు, బెంగళూరు వెళ్లిపోక తప్పదని ఎద్దేవా చేశారు.

More Telugu News