Andhra Pradesh: చంద్రబాబు ‘పసుపు-కుంకుమ’ పేరుతో కొత్త సినిమా తీశారు.. అక్కచెల్లెమ్మలను మోసం చేశారు!: జగన్

  • ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు
  • బాబుతో పాటు రాష్ట్రానికి కరవు కూడా వచ్చింది
  • టంగుటూరు బహిరంగ సభలో వైసీపీ అధినేత విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలకు ఇప్పటివరకూ దిక్కులేకుండా పోయిందని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఇప్పుడు జాబు కావాలంటే బాబు పోవాలని వ్యాఖ్యానించారు. దొనకొండలో పారిశ్రామిక నగరం, చీమకుర్తిలో మైనింగ్‌ విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఎయిర్‌పోర్ట్‌, కనిగిరిలో జాతీయ పెట్టుబడుల ఉత్పత్తుల జోన్‌, ఫుడ్‌ పార్క్‌, వినుగొండ ప్రాజెక్ట్‌, ఒంగోలు స్మార్ట్‌ సిటీ, ఉద్యానవన యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ ఇలా ప్రతీ విషయంలో చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కరవు కూడా వచ్చిందని జగన్ ఎద్దేవా చేశారు. హెరిటేజ్‌ కోసం రాష్ట్ర రైతులను అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద జగన్‌ వచ్చి ధర్నా చేస్తే తప్పా ధర పెరగని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆస్తులను అమ్ముకుంటే తప్పించి చదువుకునే పరిస్థితి లేదన్నారు. ఫీజులను పెంచడంతో పాటు ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు ‘పసుపు-కుంకుమ’ పేరుతో కొత్త సినిమా తీశారని జగన్ ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు అక్కచెల్లెమ్మలను మోసం చేశారన్నారు. గడ్డిలేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కిడ్నీ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Chandrababu
YSRCP
Jagan
Prakasam District
Telugudesam

More Telugu News