YS Viveka: కీలక ఆధారాలు లభ్యం... కొలిక్కి వచ్చిన వైఎస్ వివేకా హత్య కేసు!

  • ఒక్కొక్కటిగా వీడుతున్న చిక్కుముడులు
  • హత్య జరిగిన రోజు రాత్రి పారిపోయిన పరమేశ్వర్ రెడ్డి
  • ఒకటి, రెండు రోజుల్లో మొత్తం వివరాలు వెల్లడయ్యే అవకాశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి గంగిరెడ్డే అనడానికి సిట్ అధికారులు కీలక ఆధారాలు సంపాదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో గంగిరెడ్డికి మొదటి నుంచి పరమేశ్వర్ రెడ్డి సహకరించారని, వివేకా హత్య జరిగిన గంట సేపటి తరువాత పరమేశ్వర్ రెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని అధికారులు గుర్తించారు.

ఆరోజు రాత్రి 2 గంటల వరకూ పరమేశ్వర్ రెడ్డి ఇంట్లోని అన్ని లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, ఒకరిద్దరు వచ్చి పోవడాన్ని గమనించామని, చుట్టుపక్కల వారు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ లలో పరమేశ్వర్ రెడ్డి తన భార్యతో కలిసి వెళుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. దీంతో ఆయనేమీ గుండె సమస్యతో ఆసుపత్రికి వెళ్లలేదని సిట్ దర్యాఫ్తు బృందం గుర్తించింది.

ఇక గంగిరెడ్డికి, వివేకాకు మధ్య ఉన్న ఆర్థిక వివాదాలే హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్న సిట్, దీనిపై అధికారిక ప్రకటనను, హత్యోదంతాన్ని ఒకటి, రెండు రోజుల్లో బయట పెట్టవచ్చని సమాచారం. ఈ కేసులో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల కాల్ డేటా, వారి బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు కీలక ఆధారాలని, వాటిని సేకరించామని, హత్యకు వినియోగించిన ఆయుధాలను నేడో, రేపో స్వాధీనం చేసుకుంటామని అధికారి ఒకరు తెలిపారు. 

More Telugu News