BJP: సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆద్యుడు మనోహర్ పారికరే!

  • రక్షణ మంత్రిగా అనేక ఘనతలు
  • సర్జికల్ దాడులతో సంచలనం
  • సౌమ్యుడిగా పార్టీ వర్గాల్లో గుర్తింపు

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విషాదం అలముకుంది. ఎంతో సౌమ్యుడిగా పేరున్న పారికర్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంటే గతంలో భారత రక్షణ మంత్రిగా వ్యవహరించినప్పుడు తనదైన ముద్రవేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2016 సెప్టెంబరులో పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొదటి సారి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించింది. యూరీ సైనిక స్థావరంపై దాడి తర్వాత భారత ఆర్మీకి పారికర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దాని ఫలితమే పీఓకేలో భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా తిరిగొచ్చాయి. ఆ సర్జికల్ దాడుల తర్వాత భారత్ పేరు, పారికర్ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయాయి.

పొరుగుదేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసేందుకు ఎక్కువగా శ్రమ తీసుకోకుండా కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని పనిముగించింది భారత ఆర్మీ. ఈ దాడులు మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా ఉన్న సమయంలో జరగడంతో ఆయన దూకుడుకు మంచి గుర్తింపే లభించింది. ఈ విషయంలోనే కాదు, భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉంచే విషయంలో కానీ, దేశవ్యాప్తంగా ఉన్న సాయుధ బలగాలకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలోనూ పారికర్ ఎంతో చొరవ చూపారు. అంతేకాదు, రాఫెల్ విమానాలు కొనుగోలు చేసి భారత వాయుసేనను శత్రు దుర్భేద్యం చేయాలన్న ఆలోచన కూడా పారికర్ హయాంలోనే మొదలైంది. 

More Telugu News