janasena: ఏపీలో బీఎస్పీకి 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించాం: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది
  • మాయావతిది మహోన్నత వ్యక్తిత్వం
  • సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకెళ్తాం

పొత్తుల్లో భాగంగా ఏపీలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీఎస్పీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్, ఆ పార్టీ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం వ్యక్తిగతంగా తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. సోదర సమానురాలైన బీఎస్సీ అధినేత మాయావతిది మహోన్నత వ్యక్తిత్వమని, అలాంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చూడాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష, అలా ఆకాంక్షించే వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. రాజకీయాలు ప్రజలను భయపెట్టేలా కాకుండా, అందర్నీ కలిపేలా ఉండాలన్న లక్ష్యంతో చాలా మంచి చక్కటి వాతావరణంలో తమ చర్చలు సాగాయని, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  

More Telugu News