మురళీమోహన్ కోడలు రూపకు రాజమహేంద్రవరం టికెట్ ఖరారు!

17-03-2019 Sun 12:18
  • రూపవైపే మొగ్గు చూపిన చంద్రబాబు
  • విషయం తెలుసుకున్న స్థానిక నేతల్లో అసంతృప్తి
  • ఇంకా అధికారికంగా వెల్లడి కాని ప్రకటన

ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదుగానీ, రాజమహేంద్రవరం లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రాజమహేంద్రవరం టికెట్ ను ఆశిస్తున్న గుడా చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావులకు ఈ విషయం తెలిసి, వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో టీడీపీ అధిష్ఠానం బుజ్జగింపు ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సీటును తొలుత మురళీమోహన్ కే ఇవ్వాలని చంద్రబాబు భావించగా, పోటీ చేసేందుకు ఆయన అంగీకరించలేదు. తనకు సీటు వద్దని ఆయన కరాఖండీగా చెప్పడంతో, మరో అభ్యర్థి కోసం వేటలో పడిన టీడీపీ, రూపవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. స్థానికంగా అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించిన తరువాత ఆమె పేరు అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆమె రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో చురుకుగా తిరుగుతూ, పలు కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు.