Chandrababu: టీడీపీ రెండో జాబితా... జేసీ అల్లుడికి, వర్ల రామయ్యకు నో చాన్స్!

  • పామర్రు సీటును కోరుకున్న వర్ల రామయ్య
  • ఉప్పులేటి కల్పన పేరు ఖరారు చేసిన చంద్రబాబు
  • తన అల్లుడు దీపక్ రెడ్డికి రాయదుర్గం సీటు కోరిన జేసీ
  • సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాల్వవైపే బాబు మొగ్గు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన రెండో జాబితాలో వర్ల రామయ్యకు స్థానం లభించలేదు. ఆయన కోరుకున్న పామర్రులో ఉప్పులేటి కల్పన పేరును చంద్రబాబు ప్రకటించారు. ఇదే సమయంలో చిత్తూరులో సత్యప్రభ స్థానంలో ఏఎస్ మనోహర్ కు సీటును ఖరారు చేశారు. సత్యప్రభను రాజంపేట నుంచి ఎంపీగా బరిలోకి దించాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు, మనోహర్ కు సీటిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రాయదుర్గం స్థానంలో తన అల్లుడు దీపక్ రెడ్డిని బరిలోకి దించాలన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోరిక కూడా నెరవేరలేదు. రాయదుర్గం సీటును ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కాల్వ శ్రీనివాసులుకే చంద్రబాబు ఖరారు చేశారు. ఇక తాడిపత్రిలో సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి, పెడనలో కాగిత వెంకట్రావుకు బదులు ఆయన కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు.

మడకశిర విషయానికి వస్తే, తప్పుడు అఫిడవిట్ ను దాఖలు చేశారన్న ఆరోపణలపై, ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న కే ఈరన్న వైపే చంద్రబాబు మరోసారి మొగ్గు చూపారు. ఇదిలావుండగా, రెండో జాబితాలోనూ తన పేరు లేకపోవడం పట్ల బండారు సత్యనారాయణమూర్తి అలక బూనినట్టు తెలుస్తోంది. మొత్తం మీద 175 అసెంబ్లీ స్థానాలకుగాను 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు.  పెండింగ్ లో ఉన్న 35 స్థానాల్లో పోటీ చేసేవారి పేర్లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News