Telangana: కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ లాంటోడు.. బాల్ అందించడానికే పనికివస్తాడు!: రేవంత్ రెడ్డి సెటైర్లు

  • తెలంగాణలో సారా-కారా-కేసీఆర్ సర్కారు నడుస్తోంది
  • రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చోటుచేసుకోలేదు
  • టీఆర్ఎస్ అధినేతపై రేవంత్ రెడ్డి విమర్శల వర్షం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ప్రజలకు ఇంతవరకూ ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ‘సారా-కారా- కేసీఆర్ సర్కారు’ నడుస్తోందని ఎద్దేవా చేశారు. సారా తాగడం, కారా(మిక్చర్) తినడం, ఇంట్లో ఉపవాసం చేస్తూ పడుకోవడం తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదనీ, సమస్యలను పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళతామని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర గల్లీలో క్రికెట్ ఆడే గచ్చిబౌలి దివాకర్ లాంటిదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు జాతీయ స్థాయి పోటీలని అభిప్రాయపడ్డారు. అక్కడ వన్డేలు, టీ20లు, టెస్టు మ్యాచులు ఉంటాయన్నారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రమే ఆటగాళ్లని స్పష్టం చేశారు. ఏమైనా ఎక్కువ, తక్కువ అయితే కేసీఆర్ బాల్ అందించడానికి పనికివస్తాడే తప్ప ఆయన ఆటగాడు ఎంతమాత్రం కాదని సెటైర్లు వేశారు. ఈ ఆట(లోక్ సభ ఎన్నికల్లో)లో కేసీఆర్ కు ఎలాంటి పాత్ర లేదని అన్నారు. తన కుటుంబంలో ఇంకొందరికి ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News