Chandrababu: తేల్చాల్సింది 49... చంద్రబాబు పెండింగ్ లో పెట్టిన స్థానాలివి!

  • ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు
  • 126 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
  • మిగతా నియోజకవర్గాలపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, నిన్న రాత్రి 126 నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థులను చంద్రబాబునాయుడు ఖరారు చేసి, ఆ జాబితాను మీడియాకు అందించారు. మిగతా 49 స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్  లో పెట్టిన ఆయన, ఒకటి, రెండు రోజుల్లోనే ఆ జాబితాను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే...

శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా, 9 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులెవరో తెలిసిపోగా, పాలకొండ పెండింగ్ లో ఉంది. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలుండగా, నెల్లిమర్ల, విజయనగరం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలుండగా, భీమిలి, గాజువాక, మాడుగుల, చోడవరం, పెందుర్తిల్లో పోటీ పడేవారిని నిర్ణయించాల్సివుంది. తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే, 19 నియోజకవర్గాలుండగా, 16 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బాబు, అమలాపురం, పిఠాపురం, రంపచోడవరం సంగతి తేల్చాల్చివుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలుండగా, పోలవరం, నర్సాపురం, నిడదవోలు, ఉంగుటూరు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. కృష్ణా జిల్లాలో 16 స్థానాలుండగా, పామర్రు, పెడన పెండింగ్ లో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 17 స్థానాలుండగా, 14 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, నరసరావుపేట, మాచర్ల, బాపట్లను పెండింగ్ లో ఉంచారు.

ప్రకాశం జిల్లాలో 12 స్థానాలుండగా, దర్శి, కనిగిరి నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించలేదు. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలుండగా, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, కడప పెండింగ్ లో ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో 14 స్థానాలుండగా, 9 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు, కర్నూలు అర్బన్, నందికొట్కూరు, కోడుమూరు, బనగానపల్లె, నంద్యాల సెగ్మెంట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా, కేవలం ఐదింటిలోనే అభ్యర్థులను ప్రకటించారు. గుంతకల్లు మడకశిర, అనంతపురం పట్టణం, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, కదిరి పెండింగ్ లో ఉన్నాయి.

చివరిగా చిత్తూరు విషయానికి వస్తే, మొత్తం 14 నియోజకవర్గాలుండగా, మదనపల్లె, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధర నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది.

More Telugu News