Nuziveedu: చంద్రబాబు ఆగ్రహాన్ని చూసి, క్షమాపణలు చెప్పిన నేత!

  • నూజివీడు అసెంబ్లీపై సమీక్ష
  • ముదరబోయినపై టీడీపీ నేతల ఫిర్యాదు
  • తన సూచనలు పాటించలేదని ఆగ్రహం

ఏపీ సీఎం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వేళ, ఆత్మరక్షణలో పడిపోయిన నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ ముదరబోయిన వెంకటేశ్వరరావు, "తప్పైంది సార్... క్షమించండి. తప్పు సరిదిద్దుకుని అందరినీ కలుపుకు వెళ్తాను" అని చెప్పినట్టు తెలుస్తోంది. నూజివీడు అసెంబ్లీ సీటు ఎవరికి ఇవ్వాలన్న విషయమై తెల్లవారుజామున 3 గంటలకు చంద్రబాబు నియోజకవర్గ సమీక్షను నిర్వహించగా, ముదరబోయినపై అసంతృప్తితో ఉన్న పార్టీ శ్రేణులు, చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన వేళ ఈ ఘటన జరిగింది.

ఆయన తమను నాలుగేళ్లుగా ఇబ్బందులకు గురి చేశారని కాపా శ్రీనివాసరావు, నూతక్కి వేణుగోపాలరావు, తదితరులు ఫిర్యాదు చేయగా, చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకుని వెళ్లాలన్న తన సలహాను పక్కన బెట్టారని, 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన చోట్ల ఇన్ చార్జ్ లను నియమించి తప్పు చేశానని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకపై ఐదుగురితో ఓ కమిటీని వేస్తానని అన్నారు. ఒకరిని ఒకరు ఓడించుకుంటే కొత్త నాయకత్వాన్ని చూసుకుంటానని హెచ్చరించారు. బాబు హెచ్చరికలతో దిగివచ్చిన ముదరబోయిన, స్వయంగా అసంతృప్త నేతల వద్దకు వెళ్లి, కొన్ని పొరపాట్లు జరిగిన మాట నిజమేనని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇకపై అందరమూ కలిసి పని చేద్దామని, తప్పులు చేసుంటే క్షమించాలని చెప్పినట్టు సమాచారం.

More Telugu News