India: ఎక్కడ చూసినా చైనానే... మోదీ మాత్రం బొక్కబోర్లాపడ్డారు: ఒవైసీ

  • చైనా దూకుడుకు బదులేదీ?
  • మోదీవి అన్నీ వైఫల్యాలే!
  • నిప్పులు చెరిగిన ఎంఐఎం అధినేత

జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయించడంలో భారత్ ఘోర వైఫల్యం చెందిందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. "మన సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుంది, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపైనా చైనా ముద్ర ఉంది, ఇప్పుడు మసూద్ అజర్ విషయంలోనూ చైనాదే పైచేయిగా నిలిచింది, విదేశాంగ విధానాల వైఫల్యంలో మాత్రం మోదీనే టాప్" అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు, జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ లోక్ సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరపాలన్న కేంద్రం నిర్ణయాన్ని కూడా ఒవైసీ విమర్శించారు. ఎక్కడైనా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు రోజుల పాటు పోలింగ్ జరగడం చూశారా? అంటూ ప్రశ్నించారు. అనంతనాగ్ పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగు జిల్లాలు ఉన్నాయని, రెండు జిల్లాలకు తొలి రోజున, మరో జిల్లాకు రెండో రోజు, ఇంకో జిల్లాకు మూడో రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. "వాహ్ మోదీగారూ వాహ్..! కశ్మీర్ ను ఏంచేయాలనుకుంటున్నారు? మీ పాలన కారణంగా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి" అంటూ వెటకారం ప్రదర్శించారు.

More Telugu News