Crime News: 'ఓసారి ఫోన్ ఇస్తారా?' అంటూ టోకరా.. హైదరాబాదులో పట్టుబడిన మొబైల్ ముఠా!

  • హైదరాబాద్‌లో రెండు గ్యాంగ్‌ల నయా మోసం
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆటో, మోటారుసైకిల్‌, సెల్‌ఫోన్‌లు స్వాధీనం

అపరిచితులైనా అర్జంట్‌గా ఫోన్‌ చేయాలి, ఒక్కసారి మీ సెల్‌ఫోన్‌ ఇస్తారా అంటే ఎవరూ కాదనలేరు. సరిగ్గా జనం ఈ బలహీనతనే తమ దోపిడీ అస్త్రంగా వాడుకుంటున్నారు రెండు గ్యాంగ్‌ల్లోని నలుగురు సభ్యులు. ఫోన్‌ చేస్తామంటూ సెల్‌ తీసుకుని అనంతరం ఉడాయించడం వీరి దొంగతనాల స్టైల్‌.

హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలోని ప్రాంతాల్లో గత కొంతకాలంగా సాగుతున్న వీరి చోరీలకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిన్న బ్రేక్‌ వేశారు. నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాలివీ. యాప్రాల్‌ బాలాజీనగర్‌కు చెందిన పల్లపు అనిల్‌కుమార్‌ (27) ప్రైవేటు ఉద్యోగి. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వాసగోని అరుణ్‌కుమార్‌గౌడ్‌ (23)తో జత కలిశాడు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పాదచారుల వద్ద ఆగుతారు. అర్జంట్‌ కాల్‌ చేయాలని ఫోన్‌ ఇమ్మని అడుగుతారు. ఎదుటి వారు జాలిపడి ఇవ్వగానే దాన్ని పట్టుకుని ఉడాయిస్తారు.

ఈ విధంగా ఆల్వాల్‌, బొల్లారం, బోయిన్‌పల్లి ఠానాల్లో పలు కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కర్ణాటకకు చెందిన మహ్మద్‌ అర్బజ్‌ (19) నగరానికి వచ్చి బంజారాహిల్స్‌ ఎన్‌బీనగర్‌లో నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలోని ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ముబిన్‌ (23) పరిచయం అయ్యింది. ఇద్దరూ జట్టుగా ఏర్పడి సెల్‌ఫోన్‌ల దోపిడీ మొదలుపెట్టారు.

మార్చి 7, 8 తేదీల్లో వరుసగా ఈ రెండు ముఠాలు సెల్‌ఫోన్‌ల చోరీకి పాల్పడడంతో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నిఘా పెట్టారు. ఒకే తరహాలో ఫోన్‌లు ఎత్తుకెళుతుండడంతో ఒకే ముఠా పని అయి ఉంటుందని భావించి కాపు కాశారు. అదే తరహా మోసానికి పాల్పడుతుండగా వీరిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్‌లు, ఆటో, ద్విచక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News