Jagan: వైసీపీ-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం.. ‘టైమ్స్ నౌ’ స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలను బయటపెట్టేసిన వైసీపీ అధికార ప్రతినిధి

  • స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడిన నిజం
  • బీజేపీతో జగన్‌కు రహస్య ఒప్పందం ఉందని వెల్లడించిన వైసీపీ ప్రతినిధి
  • జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏమవుతారో అంటూ వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న సంగతి తాజాగా బయటపడింది. జాతీయ న్యూస్ చానల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. స్వయంగా వైసీపీ ప్రతినిధే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఏపీలో బీజేపీకి వైసీపీ బి టీం అనడంలో సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కొన్ని స్థానాల్లో బీజేపీపై బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీతో ఓ అవగాహనకు వచ్చినట్టు విజయవాడకు చెందిన వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి న్యూస్ చానల్ ప్రతినిధికి చెప్పుకొచ్చారు.  

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో తాము ఇంతకుముందు వారి అభ్యర్థులకు మద్దతు తెలిపినట్టు ఆయన వివరించారు. బీజేపీతో వైసీపీకి రహస్య ఒప్పందం ఉందని, ఇది వందశాతం నిజమని మనోజ్ చెప్పుకొచ్చారు. బీజేపీ కోసం వైసీపీ పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో బుగ్గన బీజేపీ నేత రాంమాధవ్‌ను కలిశారు కదా? అన్న టైమ్స్ నౌ ప్రతినిధికి మనోజ్ బదులిస్తూ.. బుగ్గన విద్యావంతుడని, ఆయనెప్పుడూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరన్నారు. బుగ్గన కలిశాకే రెండు పార్టీల మధ్య ఓ అవగాహన ఏర్పడిందా? అన్న ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు.

  రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులే లేరు కదా? మరి, వైసీపీ అభ్యర్థులు ఎవరైనా బీజేపీ తరపున పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు మనోజ్ మాట్లాడుతూ.. అలా జరగదన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనన్న ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిపై చాలా బలహీనమైన వ్యక్తులను నిల్చోబెడతామన్నారు. ఇదే పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు.

అయితే, ఈ విషయంలో అధ్యక్షుడు జగన్ నుంచి డైరెక్టుగా ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వివరించారు. జగన్‌తో ఎవరైతే నిత్యం టచ్‌లో ఉంటారో వారి నుంచే ఇటువంటి ఆదేశాలు వస్తుంటాయన్నారు. పెద్దిరెడ్డి వంటి వారు చెబుతుంటారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని మనోజ్ పేర్కొన్నారు. జగన్‌కు రాజకీయం అంటే ఏంటో నేర్పింది విజయసాయిరెడ్డేనని పేర్కొన్నారు. ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు ఏమవుతారో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

More Telugu News