తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం.. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ విడుదల!

13-03-2019 Wed 11:52
  • ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీపై సినిమా
  • లక్ష్మీపార్వతిగా నటించిన శ్రీరెడ్డి
  • బెంగళూరులో కీలక సన్నివేశాల షూటింగ్

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘ఎన్టీఆర్ కథనాయకుడు’ సినిమాలను ఇప్పటికే తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.

ఇందులో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఇంట్లోకి ప్రవేశించగానే దీపాలు ఆరిపోయినట్లు, గద్ద అక్కడే తచ్చాడినట్లు చూపించారు. దీనికి ‘తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం’ అనే క్యాప్షన్ ను జతచేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను బెంగళూరులో చిత్రీకరిస్తున్నారు.

ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగిందన్నది చూపించనున్నట్లు కేతిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి నటిస్తున్నారు. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.