E-Biz: విద్యార్థులే లక్ష్యం.. కోర్సుల పేరు చెప్పి రూ.1000 కోట్లు వసూలు చేశారు: సీపీ సజ్జనార్

  • కంప్యూటర్ కోర్సుల పేరుతో మోసాలు
  • 7 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న సంస్థ
  • 16 వేలు కట్టించుకుని సభ్యుడిగా చేర్చుకుంటారు
  • ఆదిలాబాద్, వరంగల్‌లోనూ కేసులు

విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ-బిజ్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. వెయ్యి కోట్ల మేర మోసాలకు పాల్పడిన ఈ-బిజ్ నిర్వాహకుడు హితిక్ మల్హాన్‌ను నేడు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. 2001లో నోయిడా కేంద్రంగా స్థాపించిన ఈ-బిజ్ సంస్థ.. ఈ-లెర్నింగ్, కంప్యూటర్ కోర్సుల పేరుతో మోసాలకు పాల్పడుతోంది. నేరస్థుడి ఖాతాలోని దాదాపు రూ.70 లక్షలను స్తంభింపజేసినట్టు సజ్జనార్ తెలిపారు.

గొలుసు కట్టు మాదిరి వ్యాపారంతో.. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. దాదాపు 7 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈ సంస్థ నిర్వాహకులు దాదాపు రూ.1000 కోట్లు వసూలు చేశారు. యువతను ఆకట్టుకునేందుకు దీనిని ఈ లెర్నింగ్ కోర్సు అని చెప్పి.. 16 వేలు కట్టి సభ్యులుగా చేర్చుకుంటారు. చేరిన వారికి 10 వేల పాయింట్లు ఇస్తారు. సభ్యులుగా చేరిన ప్రతి వ్యక్తికీ కమిషన్ రావాలంటే మరో ఇద్దరిని చేర్చాల్సి ఉంటుంది. సభ్యులకు కంప్యూటర్ కోర్సుతో పాటు మరో 58 రకాల కోర్పులు నేర్పిస్తామని చెబుతారు. కోర్సు పూర్తయ్యాక 50 శాతం మార్కులు వస్తే ధ్రువపత్రం ఇస్తారు. ఆదిలాబాద్, వరంగల్‌లోనూ దీనిపై కేసులు నమోదయ్యాయి. సంస్థ నుంచి మోసపోయిన బాధితులు ఇంకా తమ వద్దకు వస్తున్నారని సజ్జనార్ తెలిపారు.

More Telugu News