Guntur District: గుంటూరు వైసీపీలో మోదుగుల తలనొప్పి!

  • ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే హామీతో మోదుగులను చేర్చుకున్న వైసీపీ
  • ఎంపీ టికెట్ కోసం పట్టుబడుతున్న మోదుగుల
  • రెండు ఎంపీ స్థానాల్లో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న లావు, కిలారి

గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన రాకతో గుంటూరు వైసీపీలో చిచ్చు రేగింది. జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని వైసీపీ అధిష్ఠానం హామీతో ఆయనను వైసీపీలో చేర్చుకున్నారు. అయితే, తనకు ఎంపీ టికెట్ మాత్రమే కావాలని ఆయన పట్టుబడుతుండటం వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాలోని నరసరావుపేట, గుంటూరు లోక్ సభ స్థానాల్లో విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యలు ప్రచారం చేసుకుంటున్నారు.

వాస్తవానికి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇవ్వడంతో గత నాలుగేళ్ల నుంచి గుంటూరు పరిధిలో శ్రీకృష్ణదేవరాయలు విస్తృతంగా పర్యటించారు. అయితే, కొన్ని నెలల క్రితం గుంటూరు నుంచి ఆయనను తప్పించి నరసరావుపేట నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో నరసరావుపేట నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే ఆయన పట్టు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదుగుల ఎంపీ టికెట్ కోసం పట్టుబడుతుండటం... జగన్ కు తలనొప్పి వ్యవహారంలా పరిణమించింది. గుంటూరు పశ్చిమ లేదా పొన్నూరు లేదా సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి మోదుగులను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, పొన్నూరులో రావి వెంకటరమణలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News