jagan: హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారు.. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా?: జగన్

  • ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు
  • అవినీతి లేని పాలన అందించడమే నా లక్ష్యం
  • ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి

నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు చేశారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాకినాడ శంఖారావ సభలో ప్రసంగిస్తూ, ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాటలను నమ్మవద్దని సూచించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందించడమే తన లక్ష్యమని చెప్పారు.

ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని... రాత్రి ఏడు దాటితే గ్రామాల్లో తిరగడానికి మహిళలు భయపడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే అది రాజన్న కొడుకు జగనన్న చేతిలోనే ఉందనే విషయం ప్రతి అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి చెప్పాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చేతిలో పెడతామని హామీ ఇచ్చారు. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతామని చెప్పారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని... ఆ దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి వద్దకు దొంగ సర్వేలు వస్తాయని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో మోసాలకు తెరదీస్తారని చెప్పారు. ప్రతి ఇంటికీ నవరత్నాలను తీసుకొస్తామని తెలిపారు.

More Telugu News