Andhra Pradesh: ఆ 7 సీట్లు ఎవరికి ఇవ్వాలి?.. అరకు టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు భేటీ!

  • లోక్ సభ అభ్యర్థిగా కిశోర్ చంద్రదేవ్ ఓకే
  • మిగతా ఏడు స్థానాలకు నేడు అభ్యర్థుల ఎంపిక
  • నేతలతో విడివిడిగా భేటీ కానున్న ఏపీ ముఖ్యమంత్రి

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోరు పెంచారు. ఇప్పటికే 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత నేడు అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో భేటీ కానున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయనున్న టీడీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు.

అరకు లోక్ సభ స్థానానికి ఇప్పటికే కిశోర్ చంద్రదేవ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. కాగా, అరకులోని పాలకొండ(ఎస్టీ),కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ), అరకులోయ (ఎస్టీ), పాడేరు(ఎస్టీ), రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులను చంద్రబాబు నేడు ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నేతతో టీడీపీ అధినేత వేర్వేరుగా సమావేశం కానున్నారు.

కాగా రంపచోడవరం టికెట్ ను టీడీపీ నేతలు ఫణీశ్వరమ్మ, చిన్నం బాబు రమేశ్, సాలూరు టికెట్ ను స్వాతిరాణి, పాలకొండ టికెట్ ను నిమ్మక జయరాజు, కురుపాం టికెట్ ను జానకిదేవి ఆశిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలుగుదేశం శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

More Telugu News