సందీప్ కిషన్ కోసమే ఈ పాట పాడాను: హీరో సిద్ధార్థ్

09-03-2019 Sat 16:54
  • సందీప్ కిషన్ నుంచి 'నిను వీడని నీడను నేనే'
  • తెలుగు సినిమానే స్టార్ ను చేసిందన్నా సిద్ధార్థ్ 
  •  అందుకే సిద్ధార్థ్ తో పాడించానన్న సందీప్       
హీరో సందీప్ కిషన్ చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'నిను వీడని నీడను నేనే' రూపొందుతోంది. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం హీరో సిద్ధార్థ్ .. 'ఎక్స్ క్యూజ్ మీ రాక్షసి .. ' అనే రొమాంటిక్ సాంగ్ ను పాడగా, తమన్ రికార్డు చేశాడు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ .. "నాకు సందీప్ కిషన్ అంటే ఎంతో అభిమానం .. నా తమ్ముడి లాంటివాడు. తను తొలిసారిగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో నన్ను పాట పాడమని అడిగాడు .. అందుకే పాడాను. తెలుగు భాషన్నా .. తెలుగు సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. నాకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది తెలుగు సినిమానే. అలాంటి తెలుగు సినిమాలో పాట పాడినందుకు ఎంతో సంతోషంగా వుంది" అన్నాడు. ఇక సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి నాకు ఎవరెవరు అండగా నిలిచారో .. వాళ్లంతా ఏదో ఒక రకంగా నా సినిమాలో భాగం కావాలని భావించాను. అందువల్లనే సిద్ధార్థ్ తో పాట పాడించాను" అని చెప్పుకొచ్చాడు.