Andhra Pradesh: రైతులకు మరో రూ.4,000 కోట్లు ఇస్తాం.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

  • 25 పార్లమెంటరీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి
  • కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు
  • అమరావతిలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

నేటికి 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మిగతా స్థానాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. అది పూర్తయిన వెంటనే ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడదామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల్లో ఇంత ఉత్సాహాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వంపై విశ్వసనీయత రెట్టింపు అయిందన్నారు. ఏప్రిల్ మొదటివారంలో రైతులకు మరో రూ.4,000 కోట్లు అందజేస్తామని పేర్కొన్నారు. అన్నదాతా సుఖీభవ, రుణమాఫితో రైతన్నల్లో భరోసా వచ్చిందని అభిప్రాయపడ్డారు. తటస్థులు, మేధావులు టీడీపీకి సంఘీభావం తెలియజేస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధికార మిత్రలపై కక్షతోనే బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న మహిళలంటే బీజేపీకి అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. పుల్వామా ఘటన పనిచేయకపోవడంతో ఇప్పుడు అయోధ్యను మోదీ తెరపైకి తెచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడమే మోదీ నిర్వాకమని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కుట్రల కూటమిగా ఏర్పడ్డాయని ఆరోపించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అని చెబుతున్నప్పటికీ, జగన్ ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాడన్నారు.

More Telugu News