Andhra Pradesh: ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం.. పని మొదలు పెట్టిన సిట్

  • డీజీపీని కలిసిన డీజీ కె.సత్యనారాయణ
  • నమోదైన కేసులు, విచారణ తీరుపై చర్చ
  • బృందాలుగా విడిపోయి.. కేసును దర్యాప్తు చేయనున్న సిట్

ఓట్ల తొలగింపుకు ఉద్దేశించిన ఫామ్7ను దుర్వినియోగం చేసిన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన సిట్ తన పనిని మొదలు పెట్టింది. ఈ సిట్ కు ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ నేతృత్వం వహిస్తున్నారు. కాసేపటి క్రితం ఏపీ డీజీపీ ఠాకూర్ ను ఆయన కలిశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, విచారణ తీరుపై చర్చించారు. కాసేపట్లో సిట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై, దర్యాప్తుపై చర్చించనున్నారు. అనంతరం బృందాలుగా విడిపోయి కేసును దర్యాప్తు చేస్తారు.

ఏపీలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొందరు వ్యక్తులు ఆన్ లైన్ లో భారీ ఎత్తున ఫామ్7 దరఖాస్తులు చేశారు. గత 10 రోజుల్లో 8.74 లక్షల దరఖాస్తులు ఈసీకి అందాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు... వీటిలో ఎక్కువ శాతం నకిలీవేనని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 350 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, టీడీపీకి చెందిన సమాచారాన్ని దొంగిలించారన్న ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రవాణాశాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది.

More Telugu News