Robert Vadra: నా చుట్టూ నలుగురు బలమైన మహిళలు: రాబర్ట్ వాద్రా

  • తల్లి, అత్త, భార్య, కుమార్తెలే నా బలం
  • మహిళల కలలు నెరవేరాలి
  • ఫేస్ బుక్ లో రాబర్ట్ వాద్రా మెసేజ్
తన చుట్టూ నలుగురు బలమైన మహిళలు ఉన్నారని, వారిచ్చే స్ఫూర్తి, చూపించే తెగువ, ధైర్యం తనకు ఆదర్శమని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆయన, తన తల్లి, అత్త, భార్య, కుమార్తెలు తన చుట్టూ ఉన్నంత కాలం, తనకెంతో సంతోషమని అన్నారు. తన కుటుంబంతో ఉన్న రెండు చిత్రాలను కూడా పోస్ట్ చేసిన ఆయన, "నేడు మాత్రమే కాదు. ప్రతిరోజూ మనదే. మీ కలలను నెరవేర్చుకునేందుకు ఇండియా సురక్షితమైన, ప్రోత్సాహవంతమైన దేశంగా మారుతుందని ఆశిస్తున్నాను" అని క్యాప్షన్ ఉంచారు.

 ఆపై "ఈడీ విచారణ పూర్తి కాగానే ఇంటికివెళ్లి వారితో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఇప్పటికే 10 రోజుల్లోని 64 గంటల సమయం వృథా అయింది. విచారిస్తున్న వారికి సహకరిస్తున్నా. నిజం నావైపుంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అని కూడా అన్నారు. మరో పోస్ట్ లో "ఎంతో మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారంతా విజయం సాధించాలి. వ్యాపార, ఆర్థిక రంగాల్లో, క్రీడల్లో, సైన్స్ లో మహిళలు గెలవాలి" అన్నారు. కాగా, అక్రమాస్తులు, భూ కబ్జాల కేసుల్లో ప్రస్తుతం రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
Robert Vadra
Sonia Gandhi
Priyaanka Gandhi
Womens Day

More Telugu News