kcr: కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

  • ఏపీని దెబ్బతీస్తామంటే సహించేది లేదు
  • టీడీపీ ఓడిపోతే.. కేసీఆర్ కు ఏపీ సామంతరాజ్యం అవుతుంది
  • బీహార్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోంది

ఏపీని దొంగదారిన దెబ్బతీస్తామంటే సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డేటా దాడులకు పాల్పడుతున్నారని, ఫామ్7 కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కోసం పని చేస్తున్న కంపెనీని దెబ్బతీసి, రాజకీయంగా నష్టం చేయాలనుకుంటున్నారని... అందుకే కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో లేక రాజకీయంగా మరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ ల పేరుతో గొప్పలు చెప్పుకున్న మీరు...  ఎన్ని డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్ని భోజన క్యాంటీన్లు ఉన్నాయని ప్రశ్నించారు. ఏపీలో అన్న క్యాంటీన్లను ఎలా కట్టామో చూడాలని అన్నారు. తమ పథకాలకు ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉండటంతో... దాన్ని దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే... రాష్ట్రం కేసీఆర్ కు సామంతరాజ్యం అవుతుందని చెప్పారు.

ఏపీపై వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ లు సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో బీహార్ తరహా బందిపోటు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో బీహార్ తరహా రాజకీయాలను చేయాలని వైసీపీ చూస్తోందని అన్నారు. వీరి కుట్రలు ప్రజలకు అర్థమైతే చాలని... ప్రజలే స్పందిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రాణాలైనా ఇస్తానని అన్నారు.

More Telugu News