Vizag: విశాఖ నగరం నడిబొడ్డున ఘోర రోడ్డు ప్రమాదం... తృటిలో తప్పిన ప్రాణాపాయం

  • ఆర్టీసీ బస్సు వెళ్లి వ్యాన్‌ ను ఢీకొట్టడంతో ప్రమాదం
  • పారిశుద్ధ్య కార్మికురాలిని తప్పించబోయి డివైడర్‌పైకి దూసుకుపోయిన బస్సు
  • బస్సు డ్రైవర్‌కు గాయాలు

విశాఖపట్టణం నడిబొడ్డున ఇసుకతోట జంక్షన్‌లో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మాత్రం స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు...మద్దిపాలెం నుంచి హనుమంతవాక వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇసుక తోట జంక్షన్‌లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని తప్పించబోయి అదుపుతప్పింది.

దాంతో పక్కనే ఉన్న డివైడర్‌పై నుంచి అవతలి రోడ్డు వైపునకు బస్సు దూసుకుపోయింది. అదే సమయంలో ఆ రోడ్డుపై వస్తున్న వ్యాన్‌ను అది ఢీకొట్టడంతో వ్యాన్‌ ముందుభాగం ధ్వంసమై డ్రైవర్‌ అందులో చిక్కుకున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్‌లో జరిగిన ఈ హఠాత్పరిణామంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. భారీ ప్రమాదమే జరిగిందని ఊహించి పరుగున వెళ్లి చూడగా వ్యాన్‌ డ్రైవర్‌ క్యాబిన్‌లో చిక్కుకోవడం గుర్తించారు. వెంటనే అతన్ని రక్షించారు. ఈలోగా బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు. బస్సు డ్రైవర్‌ కాలు విరగడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

More Telugu News