Uttar Pradesh: నడిరోడ్డుపై ఘోరం... కశ్మీర్ నుంచి వచ్చిన చిరు వ్యాపారులను చావగొడుతున్న యూపీ వాసులు... వీడియో!

  • వ్యాపారం నిమిత్తం వచ్చిన ఇద్దరు వ్యక్తులు
  • ఆధార్ కార్డులు చూపాలంటూ కొట్టిన కొందరు
  • ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

వారు చేసిన పాపం ఏంటంటే... కశ్మీర్ లో పుట్టి, పొట్ట చేత పట్టుకుని ఉత్తరప్రదేశ్ కు రావడమే. రోడ్డు పక్కన కూర్చుని డ్రై ఫ్రూట్స్ అమ్ముకోవడమే. తమ రాష్ట్రంలోకి వచ్చారని ఆరోపిస్తూ, ఇద్దరు కశ్మీర్ చిరు వ్యాపారులను యూపీకి చెందిన కొందరు దారుణంగా కొడుతూ హింసించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సెంట్రల్ లక్నోలో నిత్యమూ బిజీగా ఉండే దలీజంగ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. పుల్వామా దాడి తరువాత ఈ తరహా ఘటనలు యూపీలో అధికంగా జరుగుతున్నాయి.

వీడియోలో కనిపిస్తున్న వివరాలను బట్టి, రోడ్డు పక్కన డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటున్న ఇద్దరు వ్యాపారుల వద్దకు వచ్చిన కొందరు, వారి ఆధార్ కార్డులను చూపాలని డిమాండ్ చేస్తూ, కర్రలతో కొట్టారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపై వాదనకు దిగారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిదికాదని, సమస్య ఏమైనా ఉంటే పోలీసులను పిలవాలని సదరు వ్యక్తి హెచ్చరించాడు. దీంతో వెనక్కు తగ్గిన నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు భజరంగ్ సోంకార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.




More Telugu News