Andhra Pradesh: ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 జమ చేస్తాం.. ‘పసుపు-కుంకుమ’పై చంద్రబాబు కీలక ప్రకటన!

  • ఏపీలో మహిళలకు ఈరోజు శుభదినం
  • మరో విడత కింద రూ.4 వేలు అందజేస్తాం
  • టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఈరోజు శుభదినమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును ఈరోజు మహిళల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.

రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి ఖాతాల్లోకి నగదు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం అన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడత లో రూ.4,000 నగదును మరోసారి అందజేస్తామని తెలిపారు. వినూత్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో భరోసా కల్పిస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రేపు ఏపీ అంతటా డ్వాక్రా మహిళలు ర్యాలీలు నిర్వహించబోతున్నారని వెల్లడించారు.

టీడీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలు కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News