Andhra Pradesh: వైసీపీ కాల్ సెంటర్ నుంచి టీడీపీ కిందిస్థాయి నేతలకు ఫోన్లు.. రికార్డు చేసి బయటపెడుతున్న నేతలు

  • గొల్లపూడి టీడీపీ నేత శ్రీను నాయక్‌కు ఫోన్
  • జగన్‌ను కలవాలనుకుంటున్నారా? అని ప్రశ్న
  • పాదయాత్ర సమయంలో మీ వివరాలు సేకరించారని వివరణ

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీగ్రిడ్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఏపీ టీడీపీలోని కిందిస్థాయి నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వెల్లువెత్తుతుండడం సంచలనమైంది. కొందరు నేతలు తమకొచ్చిన ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణా జిల్లా గొల్లపూడికి చెందిన టీడీపీ నేత శ్రీనునాయక్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌కు సంబంధించిన సంభాషణను టీడీపీ విడుదల చేసింది. ఆ సంభాషణ ప్రకారం..

శ్రీను నాయక్‌కు ఫోన్ చేసిన ఓ యువతి తన పేరు ప్రియాంక అని తాను జగనన్న కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పి పరిచయం చేసుకుంది. తన వివరాలు, ఫోన్ నంబరు ఎలా వచ్చాయన్న శ్రీను నాయక్ ప్రశ్నకు ఆమె బదులిస్తూ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ వివరాలు తీసుకున్నారని సమాధానం వచ్చింది. మీ ప్రాంతంలో మీరు చేస్తున్న మంచి పనులను గుర్తించిన జగన్ మీ వివరాలు తీసుకున్నారని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు.  

తాను చేసిన మంచి పనులేమిటో చెప్పాలని, తన ఊరు, జిల్లా ఏదో చెప్పాలని ఆయన ఎదురు ప్రశ్నించగా అమె అన్ని వివరాలు సరిగ్గా చెప్పడంతో ఆశ్చర్యపోవడం టీడీపీ నేత పనైంది. జగనన్న పిలుపునకు సంబంధించి లేఖను పోస్టు ద్వారా పంపించామని, అయితే పూర్తి వివరాలు లేకపోవడంతో వెనక్కి వచ్చిందని, పూర్తి వివరాలు చెప్పాలని ఆమె కోరింది.  

దీంతో, తొలుత తాను చేసిన మంచి పనులేమిటో చెప్పాలని శ్రీను నాయక్ మరోమారు ప్రశ్నించగా, తనకు తెలియదని, జగన్ అందరి గురించీ ఆరా తీస్తున్నారని ఆమె చెప్పింది. మీ గురించి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతోనే ఫోన్ చేసినట్టు వివరించింది.

దీంతో, మంచి పనులపై పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించగా తాను చెప్పలేనని ముక్తసరిగా జవాబిచ్చింది. అంతటితో ఆగక జగన్‌తో మీరు కలవాలనుకుంటున్నారా? అని శ్రీనును ప్రశ్నించింది. ఆయనను తాను కలుస్తానని ఎవరు చెప్పారని, ఫోన్ చేసి పేరుపెట్టి మరీ పిలిచి కలవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించడం ఏమిటని ఆయన కాస్తంత గట్టిగానే ఆడిగారు. ఆయనను కలవడానికి మీరేమైనా మధ్యవర్తిత్వం చేస్తారా? అని ప్రశ్నించారు.

దీంతో తత్తరపడిన ఆమె మధ్యవర్తి అని కాదు కానీ, జగన్ గారు 13 జిల్లాల్లోనూ మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చింది. ‘అయితే, చేసుకోమను’ అని శ్రీను నాయక్ చెప్పడంతో ‘థ్యాంక్యూ’ అంటూ ఫోన్ పెట్టేసింది.

  • Loading...

More Telugu News