MS Dhoni: సొంతగడ్డపై 'పెవిలియన్' ప్రారంభోత్సవాన్ని నిరాకరించిన ధోనీ

  • జార్ఖండ్ క్రికెట్ సంఘం విజ్ఞప్తిని తోసిపుచ్చిన దిగ్గజం
  • మరోసారి గొప్పదనం వెల్లడి
  • ఆశ్చర్యపోయిన క్రికెట్ అధికారులు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గొప్పదనాన్ని వివరించేందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేదానికి సిసలైన నిదర్శనం ధోనీ. నేల విడిచి సాము చేయని తత్వం ఇప్పటికీ ఈ జార్ఖండ్ ముద్దుబిడ్డను మిగతావారికంటే ప్రత్యేకంగా నిలుపుతుంది. మరోసారి ధోనీ ప్రత్యేకతను చాటే సంఘటన జరిగింది. జార్ఖండ్ ప్రధాన నగరం రాంచీలో జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పేరిట క్రికెట్ స్టేడియం నిర్మించారు. ఇందులో ఒకవైపు భాగానికి మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్ అని నామకరణం చేశారు. ధోనీ ఘనతకు గుర్తుగా జార్ఖండ్ క్రికెట్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే తన పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్ ను ధోనీయే ప్రారంభిస్తే అంతకుమించిన సన్నివేశం ఏముంటుందని జార్ఖండ్ క్రికెట్ సంఘం భావించింది. కానీ ధోనీ వారి కోరికను సున్నితంగా తోసిపుచ్చాడు. నా సొంత ఇంట్లో నేను ప్రారంభోత్సవం చేయడానికి ఏముంటుంది? అంటూ తనదైన శైలిలో స్పందించాడు. దీనిపై జార్ఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి దేబాశీష్ చక్రవర్తి మాట్లాడుతూ, ధోనీ ఇప్పటికీ నిరాడంబరమైన వ్యక్తిగానే ఉన్నాడని దీన్నిబట్టి అర్థమవుతుందని అన్నారు.

More Telugu News