Facebook: అభినందన్ సోషల్ మీడియా అకౌంట్లన్నీ ఫేక్... అసలు విషయం చెప్పిన ఐఏఎఫ్

  • అభినందన్ సోషల్ మీడియాలో లేడు
  • ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు లేవు
  • అన్నీ నకిలీలే... భారత వాయుసేన ట్వీట్

భారత వాయుసేన వింగ్ కమాండర్, పైలట్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం దేశంలో యూత్ ఐకాన్ గా గుర్తింపు పొందాడు. అభినందన్ స్టయిల్ ను ఫాలో అవుతూ అతనిలా హెయిర్ స్టయిల్, మీసకట్టు డిజైన్ చేయించుకుంటున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఈ సాహస వీరుడిపై పోస్టులకు లెక్కే లేదు. అయితే, అభినందన్ పేరుతో ఉన్న కొన్ని ఐడీల ద్వారా వస్తున్న పోస్టులకు, అభినందన్ కు సంబంధంలేదని భారత వాయుసేన స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు అభినందన్ పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి పోస్టులు పెడుతున్నట్టు తాము గుర్తించామని, అసలు నిజం ఏంటంటే, అభినందన్ కు ఇప్పటివరకు సోషల్ మీడియాలో అకౌంట్లేవీ లేవని వెల్లడించింది. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

అభినందన్ కు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దేనిలోనూ అకౌంట్లు లేవని, ఆయన పేరుతో కనిపిస్తున్న అకౌంట్లను ఎవరూ అనుసరించవద్దని విజ్ఞప్తి చేసింది. IAFAbhinandanV, abhinandanhere, @_Pilotiaf, @WC_Abhinandan, @AbhiNandan_Wcdr, @W_abhinandan.. ఐడీలతో మొదలయ్యే అకౌంట్లను ట్విట్టర్ లో ఎవరూ ఫాలో కావద్దని సూచించింది. అవన్నీ అభినందన్ పేరిట ఏర్పడిన నకిలీ అకౌంట్లని ఐఏఎఫ్ తన ట్వీట్ లో పేర్కొంది.

More Telugu News