rafale: రాఫెల్ డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్లు చోరీ అయ్యాయి: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

  • రక్షణ శాఖ కార్యాలయం నుంచి పత్రాలు మాయమయ్యాయి
  • ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు ఈ పని చేసి ఉండవచ్చు
  • దీనిపై దర్యాప్తుకు ఆదేశించాం

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించిన కీలక పత్రాలు మాయం అయ్యాయి. రక్షణశాఖ కార్యాలయం నుంచి ఇవి చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది.

వాదనల సందర్భంగా ఓ నోట్ లో ఉన్న వివరాలను న్యాయవాది ప్రశాంత్ భూషన్ చదువుతుండగా వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన అంశాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచి చోరీకి గురయ్యాయని... దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు వీటిని చోరీ చేసి ఉంటారని చెప్పారు. వార్తాపత్రికల్లో ప్రచురితమైన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎంత కీలకమైనదో ఇటీవల జరిగిన పరిణామాలు చెబుతున్నాయని... వీటిని శల్యపరీక్ష చేయడం వల్ల భవిష్యత్తు కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని అన్నారు. ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ఇతర దేశాలు వెనుకంజ వేయవచ్చని తెలిపారు. 

More Telugu News