Asghar: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముఫ్తీ అబ్దుల్ అస్గర్ గురించిన ఆసక్తికర వివరాలు!

  • 1999లో ఐసీ-814 హైజాక్
  • ఆపై సోదరుడు మసూద్ ను విడిపించుకున్న అస్గర్
  • ఇండియాపై ఎన్నో దాడులకు సూత్రధారి అస్గర్

మౌలానా మసూద్ అజర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ ను పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన నేరచరిత్ర, భారత్ లో జరిపిన దాడులు తదితర వివరాలను పరిశీలిస్తే...

1990 దశకం చివరిలో మౌలానా మసూద్ అజర్, భారత పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అతన్ని ఎలాగైనా విడిపించుకోవాలన్న ఉద్దేశంతో 1999లో ఐసీ-814 విమాన హైజాక్ ప్లాన్ వేసింది అస్గరే. అప్పుడు అతని వయసు కేవలం 24 సంవత్సరాలు.

విమానం హైజాక్ ఉదంతం తరువాత, మసూద్ ను తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఈ ఘటన తరువాత పాక్ లో అస్గర్ కీలక ఉగ్రనేతగా ఎదిగాడు.

ఆ తరువాత ఇండియాపై ఎన్నో ఉగ్రదాడులకు స్వయంగా ప్రణాళికలు రచించాడు. ప్రస్తుతం భారత్ టాప్-5 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఆస్గర్ నేతృత్వంలోనే, 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, పార్లమెంట్ లపై ఉగ్రదాడులు జరిగాయి.

2016లో పఠాన్ కోట్ భారత వాయుసేన ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి, నగోర్తా, ఖతువా క్యాంపులపై దాడి వెనకుంది అస్గరే. ఇటీవలి పుల్వామా దాడి వెనుక కూడా అస్గర్ ఆదేశాలు, మార్గనిర్దేశనం ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.

జైషే మహమ్మద్ వర్గాల్లో మసూద్ అజర్ గైర్హాజరీలో అన్ని నిర్ణయాలనూ అస్గరే తీసుకుంటాడట. గతంలో పాక్ అధ్యక్షుడిగా ముషారఫ్ ఉన్న వేళ, ఆయనపై హత్యాయత్నానికి కూడా అస్గర్ నేతృత్వంలోనే ప్లాన్ వేశారు. అయితే అది విఫలం కావడంతో, కొన్నాళ్ల పాటు అస్గర్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆఫ్గనిస్థాన్ కు వెళ్లిన అస్గర్, తాలిబాన్ నేతలకు దగ్గరై, బలం పుంజుకుని, ముషారఫ్ పదవీచ్యుతుడైన తరువాత స్వదేశంలోకి వచ్చాడు.

More Telugu News