High Court: 'జగన్ పై దాడి' కేసు నిందితుడు శ్రీనివాసరావు పనిచేసిన హోటల్ కాంట్రాక్టు రద్దు ఆదేశాలను నిలిపివేసిన హైకోర్ట్!

  • ఏఏఐ ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయన్న పిటిషనర్
  • సిబ్బంది గత చరిత్ర యజమానికి ఎలా తెలుస్తుందన్న కోర్టు
  • ఏఏఐ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు పనిచేసిన ‘ప్యూజన్‌ ఫుడ్‌ అండ్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏఏఐ జారీచేసిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హోటల్ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏఏఐ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ హోటల్ ఎండీ టి.హర్షవర్ధన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. జగన్‌పై ఎయిర్‌పోర్టులో దాడి జరిగినప్పుడు నిందితుడు శ్రీనివాసరావు హోటల్‌లో ఉద్యోగి మాత్రమేనని, దాడితో హోటల్‌కు కానీ, పిటిషనర్‌కు కానీ ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ పిటిషనర్‌ను బాధ్యుడిని చేస్తూ ఏఏఐ ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు.

ప్రతివాది తరపు న్యాయవాది మాట్లాడుతూ.. హోటల్ నిబంధనలు అతిక్రమించిందని, ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. దీంతో కల్పించుకున్న ధర్మాసనం.. నిందితుడి నేర చరిత్ర గురించి యజమానికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. బస్టాండులోని రవాణాశాఖ ఉద్యోగి ఒకరు ప్రయాణికులపై రాయి విసిరితే సంస్థపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఏఏఐ ఆదేశాలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
High Court
Andhra Pradesh
Jagan
Kodikathi
AAI

More Telugu News