Pakistan: "గో మూత్రం తాగేవాళ్లు" అంటూ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి... నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించిన ఇమ్రాన్!

  • నష్టనివారణ చర్యలు చేపట్టిన ఇమ్రాన్ సర్కారు
  • హిందువులపై వ్యాఖ్యలు చేసిన మంత్రి తొలగింపు
  • మత సహనమే పునాది అంటూ తెహ్రీకే ట్వీట్

ఉగ్రవాదం విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హిందుత్వ వ్యతిరేక అపప్రధను తొలగించుకోవడానికి కూడా అంతే తపన చూపిస్తున్నారు. తాజాగా, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఓ రాష్ట్ర మంత్రిని వెంటనే తొలగించారు. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి ఫయాజుల్ హసన్ చోహాన్ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ రాష్ట్ర క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికారు.

పుల్వామా దాడి అనంతరం ఆయన హిందువులను ఉద్దేశించి... "గోమూత్రం తాగే వాళ్లు" అని వ్యాఖ్యానించారు. చోహాన్ చేసిన వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి తలనొప్పిగా మారాయి. పార్టీ సీనియర్ లీడర్లతో పాటు పాక్ లో మైనారిటీ వర్గంగా ఉన్న హిందువుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో చోహాన్ ను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం తమ దేశ విధానం కాదని, మత సహనమే తొలి పునాదిగా పాకిస్థాన్ దేశం నిర్మితమైందని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ ట్వీట్ చేసింది. వాస్తవానికి మంత్రి ఫయాజుల్ హసన్ చోహాన్ ను పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ క్షమించారు. కానీ ప్రధాని ఇమ్రాన్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు.

అతడ్ని మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ సొంతపార్టీకి చెందిన బుజ్దార్ కు స్పష్టం చేశారు. పాకిస్థాన్ లో అధికారిక గణాంకాల ప్రకారం 75 లక్షల మంది హిందువులు ఉన్నారు. అయితే, వారి వాస్తవ సంఖ్య 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. పాక్ హిందువుల్లో అత్యధికులు సింధ్ ప్రావిన్స్ లో నివసిస్తున్నారు. దేశ విభజన కాలం నుంచి అక్కడి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమయ్యారు.

More Telugu News