Andhra Pradesh: దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయి!: చంద్రబాబుపై బీజేపీ నేత జీవీఎల్ సెటైర్

  • ప్రజల వివరాలను ప్రభుత్వం దుర్వినియోగం చేసింది
  • దీనిపై లోతైన విచారణ జరగాలి
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత

ఓటర్ జాబితాను సేకరించిన ఏపీ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అసలు ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ సమాచారం ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేయడం ద్వారా ఏపీ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.

ఈ డేటాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో తన బండారం బయటపడుతుందని బాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు. డేటా చోరీతో ఏపీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని.. ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.

ఈ విషయంలో లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పచ్చచొక్కాలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

More Telugu News