jain: జనాభాను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జైన మహాసభ

  • తగ్గుతున్న జైనుల జనాభా పెరుగుదల శాతం
  • ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కనాలన్న జైన మహాసభ
  • మూడో సంతానం విద్యకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ

తమ మతం జనాభాను పెంచే విధంగా జైన మహాసభ కీలక నిర్ణయం తీసుకుంది. జైన దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చింది. 2001లో దేశం మొత్తం మీద జైనుల జనాభా 42 లక్షల మందిగా ఉంటే... 2011కి అది 44 లక్షలకు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో తమ జనాభా పెరుగుదల శాతం తగ్గుతోందనే కలవరం మత పెద్దల్లో మొదలైంది. దీంతో, 'హమ్ దో.. మహారే తీన్' నినాదంతో జైన్ దంపతులు ముందు సాగాలని పిలుపునిచ్చారు. ఇండోర్ లో జరిగిన జైన మహాసమితి సభలో ఈ మేరకు ప్రకటించారు.

మూడో సంతానం విద్యకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని జైన మహాసమితి జాతీయ అధ్యక్షుడు అశోక్ బడ్జాతియా ప్రకటించారు. ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులను ప్రోత్సహించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పెళ్లి వయసు వచ్చిన యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేలా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. విడాకులు తీసుకున్న వారు మళ్లీ పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

More Telugu News