Andhra Pradesh: జగన్ ను లొంగదీసుకుని ఏపీ ఆర్థిక మూలాలపై దాడిచేశారు!: కేసీఆర్ పై చంద్రబాబు నిప్పులు

  • 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల డేటాను సేకరించాం
  • ఇప్పుడు ఆ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చేశారు
  • తెలంగాణ సర్కారుపై సీఎం మండిపాటు

ఏ పార్టీకి లేని టెక్నాలజీ టీడీపీ సొంతమనీ, 24 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల డేటాను సేకరించామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఆ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చేశారనీ, అంతేకాకుండా దాన్ని ప్రభుత్వ డేటా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన డేటాను దొంగిలించి మనపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు ప్రజాప్రతినిధులు, టీడీపీ బూత్ స్థాయి కన్వీనర్లతో ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

దమ్ముంటే రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, కేసీఆర్, జగన్ ముసుగు తీసి ప్రచారం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సవాల్ విసిరారు. కేసీఆర్ కు జగన్ సామంత రాజుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీని సామంత రాజ్యం చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్ ను లొంగదీసుకుని ఏపీ ఆర్థికమూలాలపై దాడిచేశారని తెలంగాణ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓర్వలేక దాడులకు దిగారన్నారు. తమ ఓపికకు కూడా ఓ పరిమితి ఉందనీ, అహంకారంతో ఏదైనా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

More Telugu News