Andhra Pradesh: హైదరాబాద్ ను ప్రపంచపటంలో నేనే పెట్టా.. అలాంటిది ఇప్పుడు నాపైనే దాడులు చేసే పరిస్థితికి వచ్చారు!: సీఎం చంద్రబాబు

  • కేంద్రం హోదా ఇవ్వకుండా వేధించింది
  • హైదరాబాద్ లో జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు
  • చిత్తూరులో జలసిరికి హారతి కార్యక్రమంలో సీఎం వ్యాఖ్య

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. న్యాయం చేయాలని అడిగితే విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ ను నేనే ప్రపంచపటంలో పెట్టా. ఇప్పుడు నాపైనే దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతకుముందు మీరు ఎక్కడున్నారో, మీ స్థాయి ఏంటో ఆలోచించుకోండి’ అని టీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈరోజు జరిగిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.

ఏపీలో ఉండాల్సిన వైసీపీ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉంటున్నారని వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఉంటూ ఆయన కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంపై దాడిచేస్తూ ఆంధ్రా ప్రజలకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న ఏపీ ప్రభుత్వ డేటా ఎవరో దొంగలిస్తే హైదరాబాద్ లో ఉన్న పోలీసులు కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏపీపై చాలా అభిమానం చూపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News